C Fore survey conducted in Karnataka shows the Congress bettering its tally in the upcoming assembly elections 2018.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని సీ-ఫోర్ సర్వే తేల్చి చెప్పింది. 2013 లో జరిగిన శాసన సభ ఎన్నికల కంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంటుందని సోమవారం సీ-ఫోర్ సర్వే విడుదల చెయ్యడంతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
2018 మార్చి 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీ-ఫోర్ సర్వే నిర్వహించింది. 154 శాసన సభ నియోజక వర్గాల్లో 22,357 మంది ఓటర్లను కలిశారు. 2,368 పోలింగ్ కేంద్రాల్లో సర్వే నిర్వహించి సర్వేని విడుదల చేశామని సోమవారం సీ-ఫోర్ సర్వే తెలిపింది.
326 నగరాలు, పట్టణాలు, 977 గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించామని, ఒక్క శాతం సర్వే అంచనాలు తప్పు అయ్యే అవకాశం ఉంటుందని సీ-ఫోర్ సర్వే వివరించింది.
2013లో సీ-ఫోర్ సర్వే విడుదల చేసింది. ఆ సందర్బంలో కాంగ్రెస్ పార్టీకి 119 నుంచి 120 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. 2013లో జరిగిన ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లు సంపాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 122 సీట్లు సొంతం చేసుకుంది.
2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకుని 46 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని, బీజేపీ 31 శాతం ఓట్లు, జేడీఎస్ 16 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని సీ-ఫోర్ సర్వే తెలిపింది.
2013లో బీజేపీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2018లో బీజేపీ 70 స్థానాలు కైవసం చేసుకుంటుందని సీ-ఫోర్ సర్వే చెప్పింది. 2018 శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ 27 నుంచి 40 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, ఇతరులు 7 శాతం ఓట్లు సంపాధించుకుని ఒక అసెంబ్లీ స్థానంలో గెలిచే అవకాశం ఉందని సీ-ఫోర్ సర్వే చెప్పింది.
సీ-ఫోర్ సర్వే ప్రకారం 48 శాతం మహిళలు, 44 శాతం పురుషులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని, 29 శాతం మంది మహిళలు, 33 శాతం మంది పురుషులు బీజేపీకి ఓటు వేస్తామని, 17 శాతం మంది పురుషులు, 14 శాతం మంది మహిళలు జేడీఎస్ కు ఓటు వేస్తామని, 8 శాతం మంది మహిళలు, 6 శాతం మంది పురుషులు ఇతరులకు ఓటు వేస్తామని సర్వేలో చెప్పారని సీ- ఫోర్ సర్వే వివరించింది.