అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. అమెరికా వస్తువులపై భారత్ 100శాతం సుంకాన్ని వసూలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేగాక, అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సైతం వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం జరిగిన జీ-7 దేశాధినేతల సంయుక్త ప్రకటన నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నులు అధికంగా వసూలు చేస్తున్నాయని అన్నారు. ‘మేమేమన్నా పిగ్గీ బ్యాంకులమా?.. అందరూ మమ్మల్ని దోచుకోవాలని చూస్తున్నారు. అమెరికా సంపదకు నష్టం వాటిల్లే విధంగా ఉంటే ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను తెంచుకుంటాం' అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో మా వస్తువులపై వందశాతం సుంకాన్ని విధిస్తున్నారు. కానీ, మేం విధించడం లేదు. మేం అలా వసూలు చెయ్యలేకపోతున్నాం. అందుకే వివిధ దేశాలతో మాట్లాడుతున్నాం' అని చెప్పారు.