Stage is set for Rajya Sabha polls on Friday for filling three seats from the State. It is ‘advantage TRS’ as the ruling party is slated to get all the seats by virtue of its strength in the Assembly.
తెలంగాణ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలను గెలిపించుకోవాలని టిఆర్ఎస్ పక్కా ప్రణాళికను రచించింది. కాంగ్రెస్ పార్టీ కూడ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ను తమ అభ్యర్ధిగా బరిలోకి దించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని తీసుకొన్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి నిరాశను తెచ్చిపెట్టింది. టిఆర్ఎస్ వ్యతిరేక పక్షాలు రాజ్యసభ ఎన్నికల్లో తమకు కలిసివస్తాయని భావించినా కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ నిర్వహణపై టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారు. గురువారం సాయంత్రం పూటే మాక్ పోలింగ్ నిర్వహించారు.
ప్రతి మంత్రికి 5 ఎమ్మెల్యేలను కేటాయించారు. ఆయా మంత్రులు తమకు కేటాయించిన ఎమ్మెల్యేలను ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్ధుల్లో ఎవరికి ఓటు చేయాలో సూచిస్తారు.ఆ సూచనల మేరకు ఎమ్మెల్యేలు ఓటు చేయాల్సి ఉంటుంది. మూడు సీట్లకు నలుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టిఆర్ఎస్ నుండి ముగ్గురు అభ్యర్ధులు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క అభ్యర్ధి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్ధిని బరిలోకి దింపింది. అయితే ఇటీవలే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలను కోల్పోయారు. నల్గొండనుండి ప్రాతినిథ్యంవ వహించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ నుండి ప్రాతినిథ్యం వహించిన సంపత్ కుమార్ లు తమ సభ్యత్వాలను కోల్పోయారు.దీంతో వీరిద్దరూ కూడ ఓటు హక్కును కోల్పోయారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించినా వీరిద్దరికి ఓటు హక్కు మాత్రం దక్కలేదు.
దీంతో తెలంగాణ రాష్ట్రం నుండి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కేవలం 117 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్క అభ్యర్ధి విజయం కోసం సుమారు 27 మంది ఓటు చేస్తే సరిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలరాం నాయక్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం 27 ఓట్లు దక్కాలి. గత ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది 21 మంది మాత్రమే. అందులో ఇద్దరి శాసనసభ్యత్వాలు కోల్పోయారు. దీంతో ఆ పార్టీ బలం 19కు తగ్గింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్‌లోకి ఏడుగురు ఎమ్మెల్యేలు వలసలతో ఆ పార్టీ బలం మరింత తగ్గింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించాలంటే అద్భుతం జరగాల్సిందే. లేదా అధికార పార్టీ లేదా ఆ పార్టీకి మద్దతిస్తున్న పార్టీల ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ చేస్తే సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. కానీ ఆ పరిస్థితులు కన్పించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.