Ganguly is confident that the current squad has the potential to beat England and Australia in their own homes in the forthcoming tours.
సఫారీ పర్యటనను ఆతిథ్యజట్టుపై 2-1 తేడాతో ముగించుకున్న భారత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ప్రశంసించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ కోహ్లి సారథ్యంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఓ ప్రముఖ మీడియాకు ఆయన రాసిన వ్యాసంలో భారత్ పర్యటనల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.
చివరిసారిగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లిన భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పట్లో మహేంద్రసింగ్ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనని 0-2తో, ఆస్ట్రేలియా టూర్‌ని 1-3తో పేలవ రీతిలో ముగించింది. అయితే.. గత వారం ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనని చూసిన తర్వాత.. కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఆ రెండు దేశాల్లో మెరుగైన ప్రదర్శన చేయగలదని గంగూలీ వివరించాడు.
'ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో సిరీస్‌లు గెలవాలనేది ప్రతి పర్యాటక జట్టు కల. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. రాబోయే పర్యటనల్లో.. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా సత్తాచాటేలా ఈ ప్రదర్శన స్ఫూర్తి నింపుతుంది. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, బుమ్రా చాల మెరుగ్గా బౌలింగ్ చేశారు. భారత బౌలింగ్ భవితవ్యం వారిపైనే ఆధారపడి ఉంది. సఫారీ గడ్డపై ఓటమితో సిరీస్‌ని ఆరంభించినా.. గెలుపుతో ముగించేలా భారత్ పుంజుకున్న విధానం అద్భుతం. ఈ జట్టు కచ్చితంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేస్తుంది' అని గంగూలీ వివరించాడు.