Andhra Pradesh CM Chandrababu Naidu responded on Kapu reservations in assembly sessions held on Saturday.
కాపులకు రెండు దశాబ్దాల్లో ఎవరూ చేయంది తాము చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ల కోసం మంజునాథ కమిషన్ వేశామని అన్నారు. అన్ని జిల్లాల్లో తిరిగి బీసీ కమిషన్ అధ్యయనం చేసిందని తెలిపారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు.
తాను పాదయాత్ర సమయంలోనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి వెనకబడి ఉన్నారని తెలుసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అప్పుడే తాను కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే, పిఠాపురం ఎన్నికల సభలోనే తాను కాపులకు రిజర్వేషన్ల హామీ ఇచ్చానని చంద్రబాబు తెలిపారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే రిజర్వేషన్లు ఇస్తున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించేందుకు రిజర్వేషన్లు అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో కాపు, తెలగ, బలిజ, ఒంటరిల జనభా 11.65శాతంగా ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని అన్నారు.