Congress leader Shashi Tharoor seems to have stirred a hornet's nest by saying that India's "democratic constitution" will not survive if the ruling BJP comes back to power in 2019 Lok Sabha elections. Tharoor said that the BJP has "elements" that may "tear apart" the Constitution and write a new one.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ... 2019లో మళ్లీ బీజేపీయే గెలిస్తే భారత్ హిందూ పాకిస్తాన్ అవుతుందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌లో ఇతర హిందువులను, క్రైస్తవులను, సిక్కులను ఎలా చూస్తారో తెలిసిందే. భారత్‌లో బీజేపీ మళ్లీ గెలిస్తే అలాగే అయ్యే పరిస్థితులు తలెత్తుతాయని థరూర్ అన్నారు. ఒకవేళ లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం మన ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం యథాతథంగా మనుగడ సాగించడం కష్టమని వ్యాఖ్యానించారు.
ఇందుకోసం బీజేపీ అవసరమైతే కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటుందని విమర్శించారు. బీజేపీ కనుక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో వస్తే ఇప్పటి వరకు ఉన్న రాజ్యాంగం స్థానంలో కొత్తది రావడం తథ్యమన్నారు. భారత్‌ను బీజేపీ హిందూ దేశంగా మారుస్తోందని దుయ్యబట్టారు.
శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నిప్పులు చెరిగింది. హిందూపాకిస్థాన్ అంటూ శశిథరూర్ వ్యాఖ్యానాలు చేయడం సిగ్గుచేటు అని బీజేపీ నేత సంబీత్ మహాపాత్ర ట్వీట్ చేశారు. భారత్‌ను చిన్నగా చేసి చూపించడానికి, హిందువులను అపఖ్యాతిపాలు చేసేందుకు కాంగ్రెస్ ఇలా వెనుకాడటం లేదని మండిపడ్డారు. హిందువులను అవమానించేందుకు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ వదులుకోదని, దానిని సంపూర్ణంగా ఉపయోగించుకుంటుందని ఎద్దేవా చేశారు.