Amaravathi:Congress leaders expressed over Jagan and Pawan's claim that the special status to AP was still alive even after the Center's affidavit filed in the Supreme Court.
ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత వైఫల్యం చెందారో...ప్రతిపక్ష పార్టీలుగా వైసీపీ, జనసేనలదీ అంతే తప్పుందంటున్నారు ఎపి కాంగ్రెస్ నేతలు.
ఏపీసీసీ కార్యాలయంలో గురువారం మాజీ మంత్రులు కోండ్రు మురళీమోహన్, సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. తాము లేవనెత్తినందునే ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగా ఉందని జగన్, పవన్ చెబుతున్నారని, ఈ మాట ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వింటే ఒప్పుకోరన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధ్యక్షుడు ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారని, కానీ సుప్రీంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ తో ఈ అంశం సజీవంగా లేదని తేలిపోయిందన్నారు.
కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే..."'వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు చత్వారం వచ్చిందా?...ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ఇప్పటికే విభజన హామీలన్నింటినీ నెరవేర్చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దాన్ని చదివేందుకు వారిద్దరికీ ఇంకా పెద్ద భూతద్దాలేమైనా కావాలా? అసలు సమస్య ఎక్కడుందో? పరిష్కారం కోసం ఎక్కడ పోరాడాలో తెలియకుండా.. ముందుగా నేను ప్రస్తావించడం వల్లే హోదా అంశం సజీవంగా ఉందంటూ జగన్, పవన్ ఎక్కడపడితే అక్కడ మాట్లాడుతున్నారు"...అన్నారు. మరి ఇప్పుడు హోదాను అటకెక్కిస్తూ కేంద్రం సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసింది...ఇంకా ఆ అంశం సజీవంగా ఎక్కడుంది? హోదా, విభజన హామీల అమలుపై మోదీపై పోరాడాల్సిన జగన్, పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు?...రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ ఇప్పుడు మోడీకి భయపడితే...భవిష్యత్తులో వారు ప్రజలకు ఇంక సేవ చేస్తారా? చేయగలరా? రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాల వైఖరిని గుర్తించాలి. నాలుగేళ్లుగా బీజేపీని నమ్ముకుని ఇటీవలే బయటకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరేమిటో భవిష్యత్‌లో తేలిపోతుంది. కానీ, ప్రతిపక్షాలు పోరాడాల్సినవారితోనూ...పోరాడాల్సిన చోట కాకుండా...రాష్ట్రంలో తిరిగితే ప్రయోజనం ఏమిటి?' అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు నిలదీశారు. రాజ్యసభలో తాను లేవనెత్తినందునే ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందని వెంకయ్యనాయుడు చెబుతారని అన్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో ఉభయ గోదావరి జిల్లాల రైతులకు నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి ఉమా, సీఎం చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.