రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. జూన్ 14న మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య రష్యా-సౌదీ అరేబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిఫా వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ వరల్డ్ కప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రష్యాకు చేరుకున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. తాజాగా ఫిఫా విడుదల చేసిన నివేదిక ప్రకారం 10 లక్షల మందికిపైగా అభిమానులు మైదానాలకు వచ్చి మ్యాచ్‌లను వీక్షించారు.
టోర్నీలో భాగంగా గురువారం డెన్మార్క్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. రష్యా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇది 21వ మ్యాచ్. 21 మ్యాచ్‌లు ముగిసే సమయానికే 10 లక్షల మందికి పైగా అభిమానులు మ్యాచ్‌లను చూసేందుకు వచ్చినట్లు టోర్నీ నిర్వాహకులు అధికారికంగా నివేదిక విడుదల చేశారు.
టోర్నీలోని ప్రతి మ్యాచ్ కూడా 97 శాతం గ్యాలరీలు అభిమానులతో నిండుతున్నట్లు ఫిఫా అధికారులు తెలిపారు. మిగతా మ్యాచ్‌లతో పోల్చితే ఉరుగ్వే-ఈజిప్టు మధ్య జరిగిన మ్యాచ్‌కు అభిమానులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు.