ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ ఆదివారంతో ముగిసింది. పైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో మూడోసారి చెన్నై ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇంతవరకు బాగానే ఉంది.
అయితే, ఈ సీజన్ ప్రశాంతంగా ముగిసిందనుకునేలోపే ఐపీఎల్‌లో మరోసారి బెట్టింగ్ కలకలం రేగింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌కు బుకీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో మహారాష్ట్రలోని థానె క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనకు శుక్రవారం సమన్లు జారీ చేశారు.
ఈ మేరకు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సోనూ జలన్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో భాగంగా సోనూ జలన్... అర్బాజ్ ఖాన్ పేరు చెప్పడంతో శనివారం విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు ఆయనకి సమన్లు జారీ చేశారు.
'దబాంగ్', 'దబాంగ్ 2' చిత్రాల్లో అర్బాజ్ ఖాన్ విలన్ పాత్రలు పోషించారు. అంతేకాకదు సల్మాన్ నటించిన పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జై చిరంజీవ' చిత్రంలో అర్బాజ్ ఖాన్ విలన్‌గా కూడా నటించారు. ఐపీఎల్ 11వ సీజన్‌లో టాప్ బుకీల ద్వారా అర్బాజ్ ఖాన్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వార్తలపై అర్బాజన్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు. పోలీసుల అదుపులో ఉన్న ఉన్న ఈ సోనూ జలన్ మరెవరో కాదు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు రైట్ హ్యాండ్. భారత్‌లో దావుద్ గ్యాంగ్ ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలను ఇతడే చూస్తుంటాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.