IPl matchs that to takes place in chennai was shifted to pune.this new ws said by Rahul Shukla.the descion Was taken in veiw of transport facilitis
ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లను బీసీసీఐ పూణెకి తరలించింది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం అధికారిక ప్రకటన చేశారు. రెండేళ్ల తర్వాత మంగళవారం చెపాక్ స్టేడియంలో తొలి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించగా నిరసనకారుల నుంచి ఆటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే.
బుధవారం తమిళ పార్టీలు చేపట్టిన రైల్‌రోకోలో ఓ ఉద్యమకారుడు అనూహ్య రీతిలో దుర్మరణం చెందాడు. దీంతో ఆందోళనకారుల ఆవేశం తారాస్థాయికి చేరింది. ఉద్యమం తీవ్రతరం కావడంతో మున్ముందు జరగబోయే మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని పోలీసు శాఖ చేతులెత్తేసింది.
ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లను చెన్నైలో నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను పూణెకు తరలించడంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎలాంటి వ్యతిరేకతా లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ హోం మ్యాచ్‌ల నిర్వహణ కోసం నాలుగు నగరాలను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసినట్టు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ నాలుగు ప్రధాన నగరాలు అవి విశాఖపట్నం, త్రివేండ్రం, పుణె, రాజ్‌కోట్. అయితే, ఈ నాలుగింటిలో చెన్నై ఫ్రాంచైజీ దృష్టిలో మొదటి పేరు మాత్రం విశాఖపట్నంగానే ఉందనే వార్తలు కూడా వెలువడ్డాయి.
రాకపోకలు సాగించడానికి కూడా విశాఖపట్నం కంటే పూణె మెరుగైన నగరమని బీసీసీఐ భావించింది. వైజాగ్ నుంచి ఇండోర్ వెళ్లాలంటే ముందుగా ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ఇండోర్ చేరుకోవాల్సి ఉంటుంది. పూణెకు మిగతా నగరాలతో మెరుగైన కనెక్టివిటీ ఉంది. ఈ కారణంగానే బీసీసీఐ వైజాగ్‌ను కాదని పూణె ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టోర్నీలో భాగంగా చెన్నై తమ తదుపరి హోం మ్యాచ్‌ను ఏప్రిల్ 20న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.