India won a ODI series 5-1 and a Twenty20 series 2-1, but second-ranked South Africa had won a Test series at the start of the tour.
సుదీర్ఘమైన దక్షిణాఫ్రికా పర్యటనలో ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో, మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని కోహ్లీసేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సఫారీ గడ్డపై అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించిన టీమిండియాను ఆ చేదు అనుభవం మాత్రం ఇంకా వెంటాడుతోంది.
ఇంతకీ ఆ చేదు అనుభవం ఏంటని అనుకుంటున్నారా? సఫారీ గడ్డపై టెస్టు సిరిస్‌ను గెలవలేకపోవడం... వరుసగా తొమ్మిది టెస్టు విజయాలను సొంతం చేసుకుని సఫారీ గడ్డపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన టీమిండియాకు నిరాశే ఎదురైంది. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌ను టీమిండియా 1-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
నిజానికి సఫారీ పర్యటనకు ముందు టీమిండియా స్వదేశంలో ఆడిన అన్ని టెస్టు సిరిస్‌లను కైవసం చేసుకుని తిరుగులేని జట్టుగా నిలిచింది. అదే ఫామ్‌ను సఫారీ గడ్డపై కూడా ప్రదర్శిస్తారని ఊహించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. జట్టు ఎంపిక, మైదానంలో అనవసర తప్పిదాలతో టెస్టు సిరీస్ 1-2తో చేజార్చుకుంది.
దీంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన పుంజుకున్న తీరు అద్భుతం. ఆ తర్వాత వరుస విజయాలతో సఫారీ గడ్డపై టీమిండియా అద్భుతాలు చేయడంతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను సైతం కైవసం చేసుకుంది. అయినా సరే, సఫారీ గడ్డపై టెస్టు సిరిస్ గెలవాలన్న కోరిక మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.