Why was YSRCP president YS Jaganmohan Reddy compared with MLA Jaleel Khan?. What YS Jagan spoke about ap special status and Tax Exemptions in an interview
ఆదాయపు పన్నుపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు.
పలువురు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తూ 'బీకాంలో ఫిజిక్స్' ఎమ్మెల్యేతో పోలుస్తుంటే.. మరికొందరు జగన్ చేసిన వ్యాఖ్యల్లో కొంత వాస్తవం లేకపోలేదని అంటున్నారు.
ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టే అవసరం ఉండదని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వెబ్ ఛానల్‌తో వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను మినహాయింపు వస్తుందని ఏ చట్టంలో ఉందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక, బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పి.. వైరల్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌తో జగన్‌ను పోల్చుతూ సెటైర్లు వేస్తున్నారు.
ఆదాయపు పన్ను మినహాయింపు ప్రత్యేక హోదా వల్ల రాదని అందరికీ తెలిసిన విషయమే అయినా.. వైసీపీ అధినేత జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం కూడా ఆయనకు తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాగా, మరికొంతమంది నెటిజన్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నారు. అంతేగాక, హోదా వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే కంపెనీలు పన్ను కట్టాల్సిన అవసరం పరిమిత కాలం వరకు ఉండదని, అదే జగన్ చెప్పారని చెబుతున్నారు.