Devdas Kanakala wife left her last breath on today morning at a private hospital in Hyderabad. She was suffering from some health-related issues from past couple of months.
సుమ-రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సుమ అత్తగారు, రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి(78) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
దేవదాసు కనకాల భార్యగానే గాక.. నాట్యకళాకారిణిగా లక్ష్మీదేవి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. కళా రంగం పట్ల ఉన్న ఆసక్తితో 11ఏళ్ల వయసులోనే ఆమె నాటక రంగంలోకి ప్రవేశించారు. తొలినాళ్లలో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో సినీ ఆర్టిస్టులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు.
నాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలే గాక.. పలు సినిమాల్లోనూ లక్ష్మీదేవి నటించారు. ప్రేమ బంధం ,పోలీస్ లాకప్, కొబ్బరి బొండం, ఒకఊరికథ లాంటి చిత్రాల్లో ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. మద్రాస్ ఇనిస్టిట్యూట్‌లో ఉపాధ్యాయురాలిగా.. సుహాసిని, శుభలేఖ సుధాకర్ లాంటి నటీనటులకు ఆమె శిక్షణ అందించారు
1971 నవంబరు 21న లక్ష్మీదేవి-దేవదాస్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. రాజీవ్ కనకాల భార్య ప్రముఖ యాంకర్ సుమ అన్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలక్ష్మీ కనకాల నాటకరంగ ప్రముఖుడు డా.పెద్దిరామారావును ప్రేమ వివాహం చేసుకున్నారు.