It is said that Telugu Desam party Telangana leader Mothkupalli Narsimhulu may join in CM K Chandrasekhar Rao lead Telangana Rastra Samithi (TRS).
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనక తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు పక్కా ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై ఆయన గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పచ్చజెండా ఊపిన తర్వాతనే ఆయన చంద్రబాబుపై విమర్శలు చేసినట్లు భావిస్త్నారు.
గతంలో మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి ఇటీవలి దాకా కెసిఆర్‌ను ఎదుర్కోవడమే ధ్యేయంగా ఉన్నట్లు మాట్లాడుతూ వచ్ారు. అయితే, ఒక్కసారిగా ఆయన తన వైఖరి మార్చుకుని తెరాసకు అనుకూలంగా మాట్లాడారు.
మోత్కుపల్లిని చేర్చుకుంటే తెలంగాణలో బలంగా ఉన్న మాదిగ సామాజిక వర్గంలో పట్టు లభిస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పియస్ నేత మందకృష్ణ మాదిగ కేసిఆర్‌పై ధ్వజమెత్తుతున్న తరుణంలో మోత్కుపల్లిని పార్టీలోకి తీసుకుంటే ఆయనకు మద్దతు తగ్గుతుందని కేసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. ఇక ముందు నెరవేరుతాయనే ఆశ కూడా లేదు. గవర్నర్ పదవి వచ్చేలా చూస్తానని చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లికి హామీ ఇచ్చారు. అయితే, బిజెపి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సూచనను పక్కనపెట్టినట్లు చెబుతున్నారు.