YSRCP MPs Vijaya Sai Reddy on Monday lashed out at Andhra Pradesh CM Chandrababu Naidu and TDP MP Sujana Choudhary for state issue.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా టీడీపీనే అడ్డుకుంటోందని ఆరోపించారు. లిక్కర్ కింగ్, బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వద్ద డబ్బులు తీసుకున్నారంటూ చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు.
ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీకి రావడం లేదని విజయసారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్ల దుర్మార్గపు పాలన, ఓటుకు నోటు, పోలవరం అవినీతి, వంటి విషయాలు బయటపడకుండా ఉండేందుకే బాబు ఢిల్లీ పర్యటన అని అన్నారు. తాను ప్రధాని మోడీని కలిస్తే తప్పుపట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి.. ఆయనను జైట్లీని ఎందుకు కలిశారని అడిగితే మాత్రం అది వేరే అంటున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు.
విజయ్ మాల్యా 2016లో రాజ్యసభలో ఉన్నారని, అదే సంవత్సరం మార్చిలో లండన్ పారిపోయారని తెలిపారు.2016, మార్చి 12, 13, 16 తేదీల్లో చంద్రబాబు నాయుడు.. విజయ్ మాల్యాను లండన్‌లో కలిశారా? లేదా అని విజయసాయి ప్రశ్నించారు.
రూ. 9వేల కోట్లు మోసం చేసిన మాల్యా నుంచి రూ.150కోట్ల విరాళాలు సేకరించలేదా? అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుంటే తన ఆరోపణలు నిజమేనని భావించాల్సి ఉంటుందని అన్నారు. తాను రాజ్యసభలో సీఎం చంద్రబాబుపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.