Chiranjeevi Emotional Comments on Sridevi.
శ్రీదేవి మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమెతో చేసిన సినిమాలు, ఆమె గొప్పతనం గురించి గుర్తు చేసుకున్నారు. తన సహచర నటి మరణాన్ని తట్టుకోలేక పోయిన ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు.
‘అందం, అభినయం కలగలిపిన అత్యధ్భుత నటి శ్రీదేవి . అలాంటి నటీమణి అంతకు ముందు లేదు. భవిష్యత్తులో కూడా వస్తారని అనుకోను. మా అతిలోక సుందరి ఈ రకంగా అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే మింగుడు పడని చేదు నిజం. భగవంతుడు చాలా అన్యాయం చేశాడు.' అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఇంత చిన్న వయసులో శ్రీదేవి ఈ రకంగా హఠాన్మరణం పొందడం అనేది జీర్ణించుకోలేక పోతున్నాను. శ్రీదేవికి చిన్నప్పటి నుండి నటన తప్ప మరొకటి తెలియదు. మరో ధ్యాస లేదు, మరో వ్యాపకం లేదు. ఎంతసేపూ నటన నటన అని ఉండేవారు. అలాంటి నటీమణులను మనం ఎప్పుడూ చూడలేం. అది ఒక శ్రీదేవిలోనే చూశాను. ఆమె అంకిత భావం చూసి చాలా నేర్చుకున్నాను. ఎంతో ఇన్స్ స్పైర్ అయ్యాను.... అని చిరంజీవి అన్నారు.
నా కెరీర్ బిగినింగులో రాణికాసు రంగమ్మ అనే సినిమా చేశాను. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా మా కాంబినేషన్లో వచ్చిన అత్యద్భుతమైన దృశ్య కావ్యం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి'... ఆమె అందులో దేవత పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా? ఆవిడ కోసమే ఆ పాత్ర సృష్టించబడిందా అన్నట్లుగా తెరమీద అద్భుతంగా కనిపించారు. శ్రీదేవి నటన చూసిన తర్వాత ఎంతలా ఇన్స్ స్పైర్ అయ్యానంటే మాటల్లో చెప్పలేను. తర్వాత ఆమెతో చేసిన ఆఖరి సినిమా ఎస్పీ పరుశురాం.... అని చిరంజీవి తెలిపారు.