India bagged 5-1 against South Africa and the T20 only affirmed that it has been continued into the shortest format as well.
సఫారీ గడ్డపై కోహ్లీసేన మరో సిరిస్‌పై కన్నేసింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో ప్రారంభమైన సుదీర్ఘమైన సఫారీ పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టెస్టు సిరిస్‌ను 1-2తో చేజార్చుకున్న ఆ తర్వాత ఆ ఓటమికి ప్రతీకారంగా ఆరు వన్డే సిరిస్‌ను 5-1తో సొంతం చేసుకుంది. అనంతరం ప్రారంభమైన మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం సెంచూరియన్‌లో జరిగే రెండో టీ20లో విజయం సాధించి టీ20 సిరిస్‌ను కూడా కైవసం చేసుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. అదే గనుక జరిగితే సఫారీ గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచిన జట్టుగా నిలుస్తుంది.
మరోవైపు ఆతిథ్య సఫారీ జట్టు మాత్రం కోహ్లీసేనకు కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి టీ20లో సఫారీ జట్టుపై కోహ్లీసేన 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో భువీ, బ్యాటింగ్‌లో ధావన్ చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం జరుగుతోన్న మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో కోహ్లీసేన కైవసం చేసుకుంటే ర్యాంకింగ్ పరంగా భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది. రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడటంపై సందిగ్థత నెలకొంది. తొలి టీ20లో గాయం కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో కోహ్లీ మైదానాన్ని విడిచిన సంగతి తెలిసిందే. దీనిపై జట్టు మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటన చేసే వరకు స్పష్టత లేదు. గాయం చిన్నదే కావడంతో కోహ్లీ మ్యాచ్‌లో ఆడేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కోహ్లీకి విశ్రాంతినిస్తే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మనీశ్ పాండే కోసం తొలి టీ20లో తన స్థానాన్ని రాహుల్ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. రెండో టీ20 జరిగే సెంచూరియన్ పిచ్ మందకొడిగా ఉండటంతో భారత్ స్పిన్ ద్వయంను ఆడించే అవకాశం ఉంది.
వన్డే సిరిస్‌లో ఓటమి పాలైన ఆతిథ్య జట్టు కనీసం టీ20 సిరీస్‌ను దక్కించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రెండో టీ20లో సఫారీలు తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండో టీ20లో సఫారీలు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ టీ20 సిరిస్ నుంచి తప్పుకోవడం జట్టుని ఇబ్బంది పెడుతోంది. హెన్రిక్స్, బెహార్డిన్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నా.. ఓపెనర్ స్మట్స్, మిడిలార్డర్‌లో డుమిని, మిల్లర్, ఫెలుక్వాయో విఫలమవుతుండటం జట్టుని తీవ్రంగా వేధిస్తోంది.