Andhra Pradesh Chief Minister Nara Chandrababu Unhappy with Central Government over polavaram project pending letter.
పోలవరం ప్రాజెక్టు కొన్ని పనులకు సంబంధించిన టెండర్లను నిలిపేయాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పుండు మీద కారం చల్లినట్లు అయింది. కేంద్రం తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం తీవ్ర ఆగ్రహం వచ్చింది. అన్ని సమస్యలు పూర్తయ్యే వరకు పోలవరం ప్రాజెక్టును ఆపివేయాలని కేంద్రం నుంచి లేఖ రావడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించేందుకు తయారవుతున్నారు.
గురువారం సీఎం చంద్రబాబును పలువురు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఆయనను చల్లబరిచారు. గుజరాత్ ఎన్నికల అనంతరం మాట్లాడుదామని చెప్పారు. అయితే సౌత్ కొరియా పర్యటనకు వెళ్లే ముందే మోడీని కలిసి విభజన హామీలపై మరికొన్ని రోజులు సమయం ఇచ్చి, అవసరమైతే ఆ తర్వాత గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.విభజన సమస్యలను పరిష్కరించాలని తాను కోరుతున్నానని, ఈ అంశాలపై తాను రాజకీయం చేయదల్చుకోలేదని చంద్రబాబు చెబుతున్నారు. బీజేపీ తమకు మిత్రపక్షం కాబట్టే సంయమనంతో వ్యవహరిస్తున్నామని, మరింత వేచిచూసే ధోరణి లేదని చెబుతున్నారు. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఇచ్చి అవసరమైతే అనూహ్య నిర్ణయం తీసుకునేందుకు కూడా టీడీపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తాను ఆశావాదిని అని, ఎదురు చూస్తానని కూడా చంద్రబాబు అంటున్నారు