YSR Congress party leader Botsa Satyanarayana has retaliaed Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chnadrababu Naidu on AP bifurcation issue.
రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజనలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ఆయన విరుచుకుపడ్డారు. రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆడిన నాటకం కారణంగానే రాష్ట్రం విడిపోయిందని ఆయన శుక్రవారం విశాఖపట్నంలో ఆరోపించారు. ఎన్నికల ముందు రాష్ట్ర విభజన అంశాన్ని చక్కగా వాడుకుని అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నరని ఆయన అన్నారు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన అంశంపై అఖిలపక్ష సమావేశంలో అప్పటి టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అశోక్ గజపతి రాజు, మోత్కుపల్లి నర్శింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులచే అసెంబ్లీలో తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పలేదా అని బొత్స చంద్రబాబును ప్రశ్నించారు.విభజన అంశానికి సంబంధించి పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ద్వారా కేంద్రానికి లేఖ పంపిన విషయాన్ని చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలని బొత్స అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డితో రాజకీయ పార్టీ పెట్టించి, ఓట్లను చీల్చి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వాడుకున్నారని ఆయన దుయ్యబట్టారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన అంశాలను చట్టంలో పెట్టించినా కూడా అధికారంలోకి వచ్చిన తరువాతే వాటిని తుంగలోకి తొక్కించారని బొత్స ఆరోపించారు.