Andhra Pradesh BJP president Kanna Lakshminarayana on Tuesday lashed out at AP CM Chandrababu for Polavaram project issue
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీనే న్యాయం చేసిందని అంటున్నారని దుయ్యబట్టారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు మతిభ్రమించినట్లు తెలుస్తోందని అన్నారు.
చంద్రబాబులో ఒక అపరిచితుడిని చూస్తున్నామని, ఆయనకున్న మానసిక రోగంతో రాష్ట్రానికి ప్రమాదమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీ అని.. ఆ సంగతి మర్చిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక వేళ ప్రధాని మోడీ ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం కలగానే మిగిలిపోయేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పోలవరం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తోందని కన్నా ఆరోపించారు. పోలవరానికి పెండింగ్ బిల్లు బకాయిలు లేవని పోలవరం అథారిటీ అధికారులు చెబుతున్నారని తెలిపారు. అంతేగాక, సమాచార హక్కు చట్టం ద్వారా తాము వివరాలు అడిగితే పోలవరం ప్రాజెక్టుకు పాత బకాయిలు లేవని సమాధానం వచ్చినట్లు గుర్తు చేశారు.