Army Major Nikhil Handa arrested for allegedly killing another officer's wife, was today sent to four-day police custody by a Delhi court.
ఆర్మీ మేజర్ హండా మరో ఆర్మీ అధికారి భార్యను హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడు హండాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరింత విచారణ కోసం అతనిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఢిల్లీ కోర్టు అతనిని నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ త్రిపాఠి మేజర్ నిఖిల్ హండాను కస్టడీకి అనుమతించారు.
సోమవారం పోలీసులు గట్టి భద్రత మధ్య అతనిని కోర్టులో హాజరుపరిచారు. అతనిని కస్టడీలోకి తీసుకొని, మీరట్ తీసుకు వెళ్లి, హత్య చేసిన సమయంలో వేసుకున్న దుస్తులు, హత్యకు ఉపయోగించిన ఆయుధం, మరేమైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకోనున్నారు.
నిందితుడైన మేజర్ నిఖిల్ హండా, హత్యగావించబడిన శైలజ మధ్య గత ఆరు నెలలుగా 3500 ఫోన్ కాల్స్ సంభాషణలు చోటు చేసుకున్నాయని పోలీసులు గుర్తించారు. ఇరువురు కలిసి శనివారం కారులో వెళ్తున్న సమయంలో పెళ్లి విషయంలో వాగ్వాదం జరగడంతో ఆమె గొంతు కోసి చంపేశాడు.
హండా ప్లాన్‌తోనే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. అతను రెండు స్విస్ కత్తులను తన వెంట తెచ్చుకున్నాడని తెలుస్తోంది. ఆమెను హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి వచ్చి ఆమెపై నుంచి కారు పోనిచ్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన సోదరుడిని కలిసి అతని నుంచి రూ.20,000 తీసుకున్నాడు. సోదరుడికి ఫోన్ చేసినట్లుగా ఉంది.