Former Congress and Minister Danam Nagender responded on party changing issue
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో బడుగుబలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించిందని దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అలా లేదని, ఒకే వర్గం చేతుల్లో పార్టీ ఉందని దానం ఆరోపించారు. వైయస్ పాదయాత్ర సమయంలో ఆరు నెలలపాటు ఇంటికి దూరమై పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. గులాంనబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీ బడుగువర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేవారని, కానీ, ఇప్పుడు అలా లేదని చెప్పారు.
30ఏళ్ల కాంగ్రెస్ జెండా మోశానని, సైనికుడిలా పనిచేశానని దానం నాగేందర్ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్నారని.. అయితే ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించలేని స్థితిలో పార్టీ ఉందని, ఒకవేళ ఎవరి పేరైనా ప్రకటిస్తే మరో 11మంది సీఎం అభ్యర్థులు అడ్రస్ లేకుండా పోతారని దానం ఎద్దేవా చేశారు. ఇదీ ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి అని అన్నారు.
తనను నమ్మకున్న కార్యకర్తల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు దానం నాగేందర్ చెప్పారు. తాను ఎప్పుడూ కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయలేదని చెప్పారు. వైయస్ లాంటి నేత కాంగ్రెస్‌లో లేరని అన్నారు. వైయస్ బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. తన రాజీనామా లేఖను యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, నేతలు గులాంనబీ ఆజాద్, కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు పంపానని దానం చెప్పారు. మిగితా కీలక నేతలకు ఫోన్ చేసి చెప్పానని తెలిపారు.