TDP president and Andhra Pradesh CM Chandrababu Naidu participated in telangana mahanadu.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తామేనని చంద్రబాబు అన్నారు. హైటెక్ సిటీ కట్టి ప్రపంచానికి హైదరాబాద్ ఎంటో చూపించామని అన్నారు. హైదరాబాద్‌ను మహానగరంగా చేశామని చెప్పారు. ఏపీకి వెళ్లినందుకు తనకు బాధ లేదని, ఇక్కడి అభివృద్ధి చేశామని, ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
గతంలో నేషనల్ ఫ్రంట్ పెట్టి దేవెగౌడను ప్రధాని చేయడంలో తానే కీలకంగా వ్యవహరించానని బాబు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా అప్పుడే పనిచేశామని చెప్పారు. 2019 తర్వాత రాజకయాల్లో మార్పు వస్తుందని, మళ్లీ టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు తెలిపారు. తనకు ప్రధాని కావాలని లేదని.. నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వారించారు. మీరెంత అరిచినా నాకు ఆ కోరిక పుట్టదని అన్నారు. తనకు రెండుసార్లు ప్రధాని పదవి పొందే అవకాశం వచ్చిందని, కానీ, వద్దని చెప్పానని చంద్రబాబు తెలిపారు. తెలువారికి సేవ చేసే భాగ్యం శాశ్వతంగా ఉంటే చాలని అన్నారు.