YSRCP MP Mekapati Rajamohan Reddy and YSRCP MPs meets President Ramnath Kovind, to take action against PM Narendra Modi and AP CM Chandrababu Naidu.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో రాజ్యాంగపరంగా నేను ఏం చేయగలనో అది చేస్తానని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తమకు చెప్పారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం చెప్పారు. వైసీపీ ఎంపీలు ఆయనను కలిసి హోదా, విభజన హామీల అంశంపై వినతిపత్రం అందించారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఏపీని కేంద్రం పట్టించుకోవడం లేదని, హోదా ఏపీ ప్రజల హక్కు అని, ఎప్పటికైనా సాధించుకుంటామని, విభజన హామీలు అమలు చేయకుంటే చరిత్రలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేనివాడిగా మిగిలిపోతరన్నారు. అదే సమయంలో చంద్రబాబుపై కూడా మండిపడ్డారు.
బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుందనే టీడీపీ , ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని మేకపాటి ఆగ్రహించారు. ఢిల్లీని మించిన రాజధాని కడతామని, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు తదితర ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని మోడీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరికాదన్నారు.
ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది జగన్ మాత్రమేనని మేకపాటి అన్నారు. చంద్రబాబు హోదాపై ఎన్నో యూటర్న్‌లు తీసుకున్నారని చెప్పారు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉండి ఇప్పుడు తాము బీజేపీతో స్నేహం చేస్తున్నామని టీడీపీ నేతలు విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రపతికి తాము అన్ని వివరాలు చెప్పామన్నారు. మోడీకి 272 సీట్లు రావడం ఏపీకి శాపంగా మారిందన్నారు.