Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu plan to corner BJP, Jana Sena and YSRCP
ప్రత్యేక హోదా ఉద్యమం సీన్ ఢిల్లీ నుంచి కొంత ఏపీకి మారింది. ఓ వైపు వైసీపీ ఎంపీలు అమరావతిలో దీక్షను కొనసాగిస్తున్నారు.మరోవైపు టీడీపీ ఎంపీలు, టీడీపీ నాయకులు ఏపీలో హోదా కోసం ఆందోళనలు చేయనున్నారు.ఇంకోవైపు, కాంగ్రెస్, జనసేన, లెఫ్ట్ పార్టీలు హోదా కోసం సాగనున్నాయి.టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేనలు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు హోదా కోసం ఏకతాటి పైకి వచ్చే అవకాశాలు లేవంటున్నారు. నిన్నటి వరకు ఢిల్లీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా కనిపించింది.ఇప్పుడు సీన్ మారింది. టీడీపీ ఇప్పుడు గ్రామగ్రామాన హోదా కోసం ఉద్యమించనుంది.
వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్, జగన్‌లను కార్నర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం జేఏసీ ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్ష ముగిసే వరకు నియోజకవర్గాల్లో రిలే దీక్షలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. హోదా ఉద్యమాన్ని విస్తృతం చేయనుంది.
సోమవారం టీడీపీ వ్యూహ కమిటీ భేటీ జరిగింది. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన కార్యాచరణను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు.
రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు బస్సు యాత్ర చేపడతారని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అవినీతి, హత్యా రాజకీయాలకు పాల్పడినవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రంతో కొందరు కుమ్మక్కై టీడీపీపై కుట్ర చేస్తున్నారని, నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. మరో వైపు వైసీపీ రైల్ రోకో నిర్వహించనుంది.