On Friday, in assembly some of the TDP MLA's are questioned AP government over agrarian issues in the state
శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే గట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. రైతు సమస్యలపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామి గురించి టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. దానికేమైనా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉందా? అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని అడిగారు. ఓవైపు పండించిన పంటను నిల్వ చేసేందుకే గోడౌన్లు లేవని,అలాంటిది ఇక రైతుకు రెట్టింపు ఆదాయం వచ్చేలా ఎలా చేస్తారో అర్థం కావడం లేదని అన్నారు. మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. పంట భీమాపై ప్రశ్నించారు.
పంట రుణం ఇస్తామని చెప్పి భీమా కట్టించుకున్నారని, కానీ పంట దెబ్బతింటే మాత్రం భీమా రావట్లేదని రవికుమార్ అన్నారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లకు ఇచ్చే రూ.1.50 లక్షలు సరిపోవట్లేదని కొంతమంది సభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇంటికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలని కోరారు.