Hardik Pandya in trouble for a tweet posted on December 26. Which Ambedkar ??? The one who drafted a cross law and constitution or the one who spread the disease called reservation in the country.
సోషల్ మీడియాలో పోస్టు కారణంగా హార్ధిక్ పాండ్యాపై కేసు నమోదు చేయాలంటూ జోధ్‌పూర్ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హార్దిక్‌పాండ్యా తన ట్విటర్ అకౌంట్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ రాజస్థాన్ రాష్ట్రం జాలోర్‌లోని రాష్ట్రీయ భీమ్ సేన సభ్యుడు, న్యాయవాది డీఆర్ మొఘవాల్ కేసు నమోదు చేయాల్సిందిగా లూనీ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించారు. అక్కడ పోలీసు అధికారులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో మొఘవాల్ కోర్టును ఆశ్రయించారు. సెక్షన్ 124-A, 153-A, 295-A, 505, 120-B ప్రకారం.. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారించి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
'ఏ అంబేద్కర్ ? దేశంలో రిజర్వేషన్ అనే వ్యాధిని వ్యాప్తి చేసిన వారేనా? ' అని ట్విటర్‌లో హార్దిక్‌పాండ్యా పోస్టు చేయడంతో వివాదమైంది. ఇటీవలే హార్డిక్ పాండ్యాను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రూ.11 కోట్లకు దక్కించుకున్న సంగతి తెల్సిందే.
భారత క్రికెట్‌లో మరో కపిల్ దేవ్‌గా హార్దిక్ పాండ్యాను అందరూ ప్రశంసిస్తున్న క్రమంలో వివాదాల్లో కూరుకుపోవడం గమనార్హం. ఇదిలా ఉంచితే సదరు కామెంట్లు చేసిన ట్విట్టర్ అకౌంట్ అధికారికంగా వాడిందా.. లేదా ఫేక్ అకౌంటా అనే విషయంపై దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.