A year ahead of general elections, Pawan Kalyan ready to hold Party Plenary and Public Meeting on a grand note at the grounds opposite Acharya Nagarjuna University on today that is March 14th which marks fourth anniversary of Jana Sena Party.Politically, Jana Sena will be more active from now onwards,' he informs.
గుంటూరు జిల్లా నాగార్జునా యూనివర్శిటీ ఎదుట ప్రాంగణంలో నేడు జరగనున్నజనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ నిర్వహిస్తున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ కావడం...రాజకీయపరంగా ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్న తరుణం కావడంతో ఈ బహిరంగ సభను అత్యంత ఆట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని సభ నిర్వాహక విభాగం సర్వ సన్నద్దం చేయగా...మరో వైపు రూట్ మ్యాప్ ను పార్టీ వర్గాలు విడుదల చేశాయి. సభకు వచ్చేవారికి అన్ని వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలా...సభా వేదిక, సీటింగ్ తో పాటు పార్కింగ్ వివరాలను సైతం ఆ మ్యాప్ లో వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభలోనే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు, ఇచ్చిన హామీలు నెరవేర్పు విషయంలో భిన్న వైఖరి, ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో పవన్-జనసేన వేయబోయే అడుగులు ఎలా ఉంటాయనే విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది.జనసేన పార్టీ నాలుగేళ్ల కిందట ఆవిర్భవించినప్పటికీ పార్టీ ప్రకటించిన తరువాత రాష్ట్ర స్థాయిలో ఈ తరహా సభ ఇంతకు ముందు ఎప్పుడూ నిర్వహించకపోవడం గమనార్హం.సభా వేదిక విషయాని కొస్తే 100 మీటర్ల వెడల్పు...50 మీటర్ల పొడవు...10 అడుగుల ఎత్తులో అత్యంత ఆర్భాటంగా నిర్మించారు. సభలో ఏ మూలన ఉన్నా పవన్ కల్యాణ్ కనబడేలా...ఆయన ప్రసంగాన్ని స్పష్టంగా వినగలిగేలా 50కు పైగా భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.
రాజధాని ప్రాంతమైన మంగళగిరి సమీపంలోని కాజాలో నివాసం ఉండటానికి పవన్ కల్యాణ్ సోమవారం ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఇకమీదట ఇక్కడే ఉంటానని పవన్ స్పష్టంగా ప్రకటించిన తరువాతే ఈ సభ జరగనుండటం మరింత ప్రాధాన్యతను పెంచింది. పైగా ప్రస్తుతం సభ తలపెట్టిన ప్రాంగణంలోనే గత ఏడాది చేనేతల సమస్యలపై ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై నేతన్నలకు అండగా ఉంటానని, వారి సమస్యలపై పోరాటం చేస్తానని సంఘీభావం ప్రకటించారు. ఏడాది గడిచాక ప్రస్తుతం ఆదే వేదిక మీద పవన్ తన పార్టీ విధి విధానాలు, టిడిపి, వైసిపి ల లోటుపాట్లపై పవన్ ప్రత్యేకంగా ఈ సభలో గళమిప్పుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.