Congress president Rahul Gandhi lashed out at Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat over his disrespectful statement against the Indian Army.
దేశ భద్రత కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న సైన్యాన్ని ఉద్దేశించి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షం మండిపడింది. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. సరిహద్దులకు ప్రైవేట్ సైన్యాన్ని పంపేందుకు అనుకూలమా? అన్న సంగతి ప్రధాని నరేంద్రమోదీ చెప్పాలని స్పష్టం చేసింది. సైన్యం మోహన్ భగవత్ వ్యాఖ్యలు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై మోహన్ భగవత్ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం కర్ణాటకలోని జెవార్గిలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ భగవత్ పొరపాటు చేశారని, అందుకు క్షమాపణ చెప్పక తప్పదన్నారు. 'సరిహద్దుల్లో మన సైనిక జవాన్లు రక్తం ధారపోస్తున్నారు. సైన్యం గురించి మోహన్ భగవత్ వ్యాఖ్యలు వినడానికే బాధగా ఉంది' అని ఆందోళన వ్యక్తం చేశారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో ఆదివారం మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘యుద్ధానికి సంసిద్ధం కావడానికి సైన్యానికి ఆరేడు నెలల సమయం పడుతుంది. కానీ మనకు (ఆరెస్సెస్ శ్రేణులకు) రెండు, మూడు రోజులు చాలు. ఇది మన సామర్థ్యం. ఇది మన క్రమశిక్షణ' అని అన్నారు. ‘మన సంస్థ మిలిటరీ సంస్థ, పారా మిలిటరీ సంస్థ కాదు.. కానీ మనకు గల క్రమశిక్షణ అలా తయారు చేస్తున్నది' అని భగవత్ వ్యాఖ్యానించారు.