Jana Sena chief Pawan Kalyan responded on Prime Minister Narendra Modi's Lok Sabha speech and Chandrababu Naidu government.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం, ఏపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ హామీలపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, లోకసభలో ప్రధాని మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు మినహా విభజన హామీల ప్రస్తావన లేవు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు.
తొలుత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ మృతికి సంతాపం తెలిపారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై తీవ్రంగా స్పందించారు. విభజన సమయంలో యూపీఏ ఏపీకి న్యాయం చేయలేదని, ఈ విషయాన్ని తాను ప్రధాని మోడీకి అప్పుడు వివరించానని చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేయాలని మోడీని 2014 ఎన్నికలకు ముందు కోరాని చెప్పారు.
బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదన్నారు. యూపీఏ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని చెప్పారు. ఇదే విషయాన్ని నాడు మోడీకి చెప్పి, మీరు న్యాయం చేయాలని కోరానని తెలిపారు.
ఏపీకి అండగా ఉంటారనే ఎన్నికలకు ముందు మోడీతో కలిశానని చెప్పారు. హామీలపై తాను తొలి ఏడాది సంయమనం పాటించానని చెప్పారు. వివిధ సాకులతో ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చారని మండిపడ్డారు
ఏపీ పరిస్థితి చూస్తుంటే బీజేపీపై నమ్మకం పోతోందన్నారు. టీడీపీ పైనా నమ్మకం పోతోందన్నారు. ఏపీలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని సర్వేలు చెబుతున్నాయని అంటూ చంద్రబాబుకు షాకిచ్చారు. ప్రత్యేక హోదాను ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైసీపీ తీరును కూడా పవన్ తప్పుబట్టారు. ఏపీకి న్యాయం జరిగేందుకు ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటై పోరాటం చేయాలన్నారు. అందరు ఓ ప్లాట్ ఫాం పైకి వచ్చి పోరాడితే బాగుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లోపాలు ఉన్నాయని చెప్పారు.