Tollywood Dialogue King Mohan Babu coming with 'Gayatri' on Feb 9th. On this eve he gave an interview and he did't show interest to respond on Pawan Kalyan politics when anchor questioned on that.
మోహన్ బాబు ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్లే ఉంటుంది. నక్కి నక్కి మాట్లాడటం.. విషయాన్ని దాటవేయడం దాదాపుగా ఆయన డైరీలోనే లేదు. అలాంటి మోహన్ బాబు.. ఓ విషయంపై స్పందించమంటే మాత్రం జవాబు దాటవేశారు. ఇంతకీ ఏంటా విషయం.. అంటే గాయత్రి' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో 'పవన్ కల్యాణ్' జనసేన రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో కొంత ఇబ్బందిగా ఫీలైన ఆయన 'నో కామెంట్' అన్నట్టుగా జవాబు దాటవేశారు. సినిమా ఇంటర్వ్యూల్లో రాజకీయాల గురించి మాట్లాడబోనని సూటిగా చెప్పేశారు.
రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదని మోహన్ బాబు చెప్పినప్పటికీ.. సదరు యాంకర్ మాత్రం ఆయన్ను కవ్వించే ప్రయత్నం చేశారు. దీంతో సున్నితంగా 'వద్దు బ్రదర్..' అంటూ వారించారు మోహన్ బాబు. పవన్ రాజకీయాల గురించి కామెంట్ చేయని మోహన్ బాబు.. గతంలో చిరంజీవి పద్మభూషణ్ అవార్డు ఫంక్షన్‌లో పవన్ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు స్పందించడం గమనార్హం.
చిరంజీవి పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా పవన్ తనను ఉద్దేశించి 'తమ్ముడూ మోహన్ బాబూ' అన్న విషయాన్ని ఆయన ఇప్పుడు గుర్తుచేసుకున్నారు. ఆరోజు జరిగినదాన్ని దాన్ని తాను సరదాగానే తీసుకున్నానని.. పవన్ అలా అన్నందుకు సంతోషించానని చెప్పారు. అయితే పవన్ అలా ఎందుకు అన్నాడా? అని తర్వాత ఆలోచించానని.. ఆపై ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేశానని మోహన్ బాబు అన్నారు.
ఇంటర్వ్యూలో డ్రగ్స్ ప్రస్తావన రాగా... ఇటీవలి ఉదంతాన్ని మోహన్ బాబు ప్రస్తావించారు. డ్రగ్స్ అనుమానితుల లిస్టులో తన బిడ్డ పేరు కూడా ఉందనే ప్రచారాన్ని విన్నప్పుడు వెంటనే ముగ్గురిని పిలిచి మాట్లాడానని అన్నారు. డిసిప్లిన్ విషయంలో తాను స్ట్రిక్ట్ గా ఉంటానని, అలాంటి క్రమ శిక్షణలో పెరిగిన బిడ్డలు దారితప్పే ఛాన్సే లేదని స్పష్టం చేశారు.