It is a sad day for the Old Monk fans. Kapil Mohan, the man behind the iconic Old Monk rum has passed away.
ప్రముఖ లిక్కర్ వ్యాపారి, డార్క్ రమ్ ఓల్డ్ మంక్ సృష్టికర్త బ్రిగేడియర్ కపిల్ మోహన్ కన్నుమూశారు. జనవరి 6వ తేదీన తుది శ్వాస విడిచారు. కాగా, ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని మోహన్ నగర్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. మోహన్ మేకిన్ లిమిటెడ్ పేరుతో 1954లో ఓల్డ్ మంక్ రమ్ సంస్థను ఆయన నెలకొల్పారు. ఓల్డ్ మంక్ తోపాటు సోలాన్ నెం.1. గోల్డెన్ ఈగల్ వంటి రెండు బ్రాండ్లను కూడా ఆయన ప్రవేశపెట్టారు.
కాగా, డార్క్ రమ్‌గా ఓల్డ్ మంక్ అమ్మకాలు కొన్నేళ్లపాటు జోరుగా సాగాయి. ఎలాంటి మద్యం తీసుకోని కపిల్ మోహన్ లిక్కర్ కింగ్‌గా ప్రాచుర్యం పొందినప్పటికీ.. చక్కెర, వస్త్ర పరిశ్రమలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించారు.
వ్యాపార రంగంలో మోహన్ కృషికి గానూ కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన అనారోగ్యం బారిన పడటంతో వ్యాపారాన్ని బంధువులకు అప్పగించేశారు. అప్పట్నుంచి ఓల్డ్ మంక్ అమ్మకాలు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.
ఎడ్వర్డ్ డయ్యర్ 1855లో కసౌలిలో తన పేరు మీద బ్రెవరీ సంస్థను ఏర్పాటు చేశారు. కొంత కాలం తర్వాత మరో లిక్కర్ సంస్థ హెచ్‌జీ మేకిన్‌తో చేతులు కలిపి.. డయ్యర్ మేకిన్ అండ్ కో లిమిటెడ్‌గా దేశ వ్యాప్తంగా వ్యాపారం చేయడం ప్రారంభించారు. 1935లో బర్మా ఉపఖండం నుంచి విడిపోగా.. డయ్యర్ మేకిన్ బ్రెవరీస్ లిమిటెడ్‌గా సంస్థ రూపాంతరం చెందింది. ఆ తర్వాత కపిల్ మోహన్ ఆ సంస్థను చేజిక్కించుకున్నారు. అనంతరం ఆ కంపెనీ మోహన్ మేకిన్ బ్రేవరీస్ లిమిటెడ్(1966-80)గా మారిపోయింది. మరికొంత కాలం తర్వాత దాని పేరు మోహన్ మేకిన్ లిమిటెడ్‌గా మార్చేశారు.