Ex-Minister, Congress Leader Shabbir Ali, Union Minister for Finance Arun Jaitley, BJP Leader Subramanian Swamy expressed their views on the Final Verdict in 2G Spectrum Case given by Special CBI Court on Thursday.
దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పుపై పలువురు ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అన్నాహజారే, పి.చిదంబరం, కపిల్ సిబాల్ తదితరులు స్పందించారు.
2జీ కుంభకోణం కేసులో టెలికాంశాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులుగా ఉన్న 17 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా స్పందించారు. షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేయగా, అరుణ్ జైట్లీ తీర్పును చూసి గర్వపడకండని వ్యాఖ్యానించారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు.
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దీనిపై కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేయడాన్ని జైట్లీ తప్పుబట్టారు. 2జీ కుంభకోణంలో వచ్చిన తీర్పును చూసి గర్వపడకండి అని ఆయన హితవు పలికారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ విఫల సిద్ధాంతాలు రుజువయ్యాయంటూ జైట్లీ విమర్శించారు.