Lovers have ben arrested in Hyderabad Punjagutta Lalitha Jewellary's theft case.
హైదరాబాదులోని పంజగుట్ట పరిధిలో గల సోమాజిగూడ సర్కిల్‌లో ఉన్న లలితా జ్యువెలర్స్ సంస్థలో గత సోమవారం జరిగిన రెండో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రేమజంటను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు జ్యువెలర్స్‌లో దొంగిలించిన సొత్తును తమ స్వస్థలానికి తీసుకెల్లి అక్కడున్న ఓ ఫైనాన్స్ సంస్థలో కుదువ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో ఆ బంగారం రికవరీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణి ఉపాధి కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్ నగరానికి వలసవచ్చారు. సికింద్రాబాద్ సింథికాలనీలోని బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్‌లో నివసిస్తున్న వీరిద్దరూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రేమజంట సులభంగా డబ్బు సంపాదించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే వీరి దృష్టి సోమాజిగూడ చౌరస్తాలో ఉన్న లలితా జ్యువెలర్స్‌పై పడిందని అంటున్నారు.
గత సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో ప్రేమికులు ఇరువురు జ్యువెలర్స్‌కు వచ్చారు. బంగారు ఆభరణాల కోసం ఆరా తీస్తూ దుకాణం మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. అక్కడున్న రద్దీని తమకు అనువుగా మార్చుకున్నారు.వివిధ రకాలైన ఆభరణాలు చూపించమంటూ సేల్స్‌మెన్ దృష్టిని మళ్ళించారు. అదును చూసుకుని అక్కడి కౌంటర్‌లో ఉన్న రెండు జతల బంగారు గాజులు (55.3 గ్రాములు), ఓ బ్రాస్‌లెట్ (10.7 గ్రాములు) ఎత్తుకుపోయారు. ఆ రోజు దుకాణం మూసే సమయంలో స్టాక్ సరి చూసినప్పుడు తేడా కనిపించింది.