Jana Sena chief Pawan Kalyan talks about Paritala Ravi and Vangaveeti Ranga .
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల అభిమానులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరిటాల రవీంద్ర తనకు గుండు కొట్టించడం, వంగవీటి రంగా హత్య, ఏపీలో ముఖ్యంగా విజయవాడలో కుల రాజకీయాలు తదితర అంశాలపై మాట్లాడారు.
రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా రాజకీయాలు చేస్తున్నానని, కొట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంతపెద్ద రాజధాని కట్టినా ఫలితం ఉండదని చెప్పారు. పార్టీ కార్యాలయం పెడుతున్నానని, అన్ని సమస్యలపై పోరాడుతానని స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడు అనే చంద్రబాబుకు మద్దతు పలికానని చెప్పారు. తన గురించి చెడుగా మాట్లాడే వారిని మనసులో పెట్టుకోలేదన్నారు.
తనకు పరిటాల రవి గుండు గీయించారని, కొట్టారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, అది పేపర్లో వేసే స్థాయికి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా ప్రచారం చేసింది ఎవరో కూడా తనకు తెలుసునని, టీడీపీలో కొందరు అలా చేశారని చెప్పారు.నాకు అలా అవమానం (గుండు కొట్టిస్తే) నేను ఊరుకునే వాడినా అని పవన్ అన్నారు. కానీ తాను అలాంటి వాటిని ఎప్పుడూ మనసులో పెట్టుకోలేదని చెప్పారు. అందుకే 2014లో టీడీపీకి మద్దతు పలికానని చెప్పారు. తనకు సినిమాలపై చిరాకు పుట్టి అప్పుడు గుండు గీయించుకున్నానని చెప్పారు.