Vallabhaneni Vamsi on Wednesday wanted to resign for his MLA post due to CMO officers rude behaviour with him.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా అంశం బుధవారం కలకలం రేపింది. అసెంబ్లీ లాబీల్లోనే రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. డెల్టా షుగర్స్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంఓ) అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ.. సీఎం ఆఫీసులో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు సమర్పించేందుకు ఆయన అసెంబ్లీకి వెల్లారు.
విషయం తెలుసుకున్న మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్... వల్లభనేని వంశీని ఆపి, రాజీనామా లేఖను చించేశారు. వెంటనే ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో, వంశీని బుజ్జగించే బాధ్యతను మంత్రి కళా వెంకట్రావుకు అప్పగించారు లోకేష్. లోకేష్ ఆదేశాలతో కళా వెంకట్రావ్.. వల్లభనేని వంశీకి సర్ధి చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ రాజీనామాపై వెనక్కి తగ్గారు.
హనుమాన్ జంక్షన్‌లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ గత నాలుగు నెలలుగా మూతపడింది. దీన్ని తణుకుకు మార్చాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని... ఇక్కడ నుంచి తరలిస్తే, ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని వంశీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.